Supreme Court : ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. ఈ సందర్భంగా పౌరసత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. న్యాయస్థానం ఓటరు జాబితా (Voters list) నుంచి ఒక వ్యక్తి పేరును తొలగించినంత మాత్రాన అతని పౌరసత్వం రద్దయినట్లు కాదని స్పష్టంచేసింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీచేసింది. ఓటరు జాబితా సవరణ కేవలం ఎన్నికల్లో పాల్గొనేందుకు మాత్రమే పరిమితమని పేర్కొన్నది. ఓటరు జాబితాలో పేరు చేర్చాలా.. వద్దా..? అని నిర్ణయించే అధికారం మాత్రమే ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టంచేసింది. అంతేకానీ ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఈసీకి లేదని తెలిపింది. పౌరసత్వంపై అనుమానంతో ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి పేర్లను మాత్రం కేంద్ర హోంశాఖకు పంపాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఈ వివరాలను నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను అందుకున్న తర్వాత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఆయా వ్యక్తుల పౌరసత్వ క్లెయిములపై విచారణ జరపాలని కోర్టు సూచించింది. తదుపరి అసెంబ్లీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ విచారణలో వారు భారత పౌరులని తేలితే వెంటనే వారి పేర్లను మళ్లీ ఓటరు జాబితాలో పునరుద్ధరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.