Supreme Court | పశ్చిమబెంగాల్ (West Bengal)లోని మమతా బెనర్జీ (Mamata Banerjee) సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court ) గురువారం సంచలన తీర్పు వెలువరించింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చేపట్టిన టీచర్ల నియామకాల రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.
ఈ మేరకు 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. టీచర్ల నియామక ప్రక్రియ చట్టవిరుద్దంగా ఉందని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా (CJI Sanjiv Khanna), జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే, ఈ తీర్పుతో ప్రభావిత ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు అప్పటివరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
ఇక ఉపాధ్యాయ నియామకాల వ్యవహారంలో గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఉద్యోగాలు పొందిన వీరంతా తమ జీతాన్ని వెనక్కి ఇచ్చేయాలని స్పష్టంచేసింది. రికవరీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. నియామక ప్రక్రియపై తదుపరి దర్యాప్తు చేపట్టాలని, మూడు నెలల్లో నివేదిక అందజేయాలని సీబీఐని ఆదేశించింది. కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టాలని పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)కు స్పష్టంచేసింది.
2016లో రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 24,640 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ రిక్రూట్మెంట్లో అక్రమాలు చోటుచేసుకొన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఉన్న ఖాళీల కంటే అధికంగా 25,753 అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారని పిటిషనర్ల తరపు న్యాయవాది ఫిర్దౌస్ షమీమ్ పేర్కొన్నారు. ఇక న్యాయస్థానం తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా తీర్పు వెలువరించింది.
Also Read..
Sonia Gandhi | వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ‘బుల్డోజ్’ చేశారు : సోనియా గాంధీ
Supreme Court | కంచ గచ్చి భూముల వ్యవహారంలో ‘సుప్రీం’ కీలక ఆదేశాలు..!
PM Modi | థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ