Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశలు జారీ చేసింది. నేటి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భూములపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను స్వయంగా సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తుది ఆదేశాలు జారీ చేసే వరకు భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టులో విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని పేర్కొంది. భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌పై విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు తుది ఉత్తర్వులు జారీ చేస్తామని.. అప్పటి వరకు చెట్లు నరకొద్దని ధర్మాసనం ఆదేశించింది.
అయితే, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అత్యవసరంగా విచారణ జరుపాలంటూ పిటిషన్ తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. వన్యప్రాణులు ఉన్న చోట భూములను చదును చేయాలంటే.. ముందుగా నిపుణుల కమిటీతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని.. అలాంటివేమీ చేయకుండా ప్రభుత్వం భూమిని చదును చేసే పనులు చేపడుతోందని పిటిషర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. పర్యావరణానికి హానీ కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా భూములు చదును చేస్తున్న చోట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పిటిషనర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. పర్యావరణానికి హానీ కలిగించేలా ప్రభుత్వం చేస్తున్న పనులపై వెంటనే విచారణ జరపాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భూములను పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.