న్యూఢిల్లీ: బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) నేడు తీర్పు వెలువరించనుంది. 2002 గుజరాత్ అల్లర సమయంలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం 2022, ఆగస్టులో విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. గత ఏడాది అక్టోబర్ 12న ఈ కేసులో తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుపై వరుసగా 11 రోజుల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు గుజరాత్ ప్రభుత్వాలు దోషులకు శిక్షను తగ్గించడానికి సంబంధించిన అసలు రికార్డులను అందించాయి. అయితే, దోషులకు క్షమాభిక్ష ప్రకటించడాన్ని గుజరాత్ సర్కార్ సమర్ధించుకున్నది. నిందితులకు ముందస్తుగా విడుదల చేయడంపై కూడా సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. అయితే, శిక్షను క్యాన్సిల్ చేయడానికి ఇది వ్యతిరేకం కాదని.. అయితే నిందితుల ఉపశమనానికి ఎలా అర్హత పొందారనే విషయాన్ని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు సీపీఐ (ఎం) నేత సుభాషిణి అలీ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రేవతిలాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సెలర్ రూప్ రేఖావర్మ, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాతో పాటు పలువురు పిటిషన్లు దాఖాలు చేశారు. 2022 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో వయసు 21 సంవత్సరాలు ఉండగా.. అప్పటికే ఐదునెలల గర్భిణి. గోద్రా రైలు దగ్ధం తర్వాత చెలరేగిన అల్లర్ల సమయంలో 11 మంది నిందితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఇందులో ఆమె మూడేళ్ల కూతురు సైతం ఉన్నది.