Supreme Court | దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం (హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి), హర్యానా ప్రభుత్వం, అంబాలా సైబర్ క్రైమ్ విభాగానికి నోటీసులు జారీ చేసింది. హర్యానా అంబాలాకు చెందిన ఒక కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. సీనియర్ దంపతులను కోర్టు పత్రాలని చెప్పి రూ.1.05కోట్ల మోసానికి పాల్పడ్డారు. డిజిటల్ అరెస్టు మోసాలపై అభిప్రాయం చెప్పాలనింటూ కేంద్రం, సీబీఐకి నోటీసులు ఇచ్చింది.
జస్టిస్ సూర్యకాంత్, జాయ్మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు, సంతకాల ఫోర్జరీలతో వ్యక్తులను మోసం చేయడమే కాకుండా న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని డిజిటల్ అరెస్టులు దెబ్బతీస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు ఒక్కటే కాదని.. న్యాయపరంగా డిజిటల్ అరెస్టులను పరిశీలించాలనుకుంటున్నట్లు తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు జరిగినట్లు మీడియాలో వచ్చాయని.. న్యాయపరమైన పత్రాలను ఫోర్జరీ చేయడం, అమాయకులను దోచుకోవడం, దోపిడీ చేయడం.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు లక్ష్యంగా జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. డిజిటల్ అరెస్ట్ నేరాలను పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసుల మధ్య చర్యలు జరగాలని.. అందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లుగా ధర్మాసనం పేర్కొంది.
వివరాల్లోకి వెళితే.. 73 సంవత్సరాలకు చెందిన మహిళ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి లేఖ రాయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లను, చదువురాని వారితో పాటు డాక్లర్లు, ఇంజినీర్లు, ప్రభుత్వ, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలు జరుగుతున్నాయని మీడియా కథనాలను కోర్టు ప్రస్తావించింది. ఇటువంటి నేరపూరిత కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కేంద్ర, రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు మధ్య సమన్వయం చేసుకోవాలని చెప్పింది.