Supreme Court | ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదంలో ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో బస్సు దహనమై మరో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రెండు ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, విజయ్ విష్ణోయ్లతో కూడిన ధర్మాసనం జాతీయ రహదారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. రాజస్థాన్‌లోని జాతీయ రహదారులపై ఉన్న ధాబాలు, ఇతర సంస్థల సంఖ్యను వివరిస్తూ రెండువారాల్లోగా వివరణాత్మక స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)ని ఆదేశించింది. రహదారి పరిస్థితులపై నివేదికను కూడా ఇవ్వాలని చెప్పింది.
ఈ కేసులో సీనియర్ న్యాయవాది ఏఎస్ నాదకర్ణిని అమికస్ క్యూరీగా నియమించిన ధర్మాసనం.. స్టేటస్ నివేదికను దాఖలు చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పార్టీగా చేర్చాలని ఆదేశించింది. రాజస్థాన్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ శివ్ మంగళ్ శర్మ.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కోర్టుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అలాగే, కర్నూలు రోరడ్డు ప్రమాదాన్ని సైతం కోర్టు పరిగణలోకి తీసుకుంది. జాతీయ రహదారి భద్రత, రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాల నియంత్రణ కోసం సమన్వయ విధానం అవలంభించడానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పార్టీగా చేయాలని ఆదేశించింది.
దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతుండగా.. ఇందులో ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారాయి. తీ క్రమంలో సుప్రీంకోర్టు ప్రమాదాలపై దృష్టి సారించింది. నేషనల్ హైవేలపై ప్రమాదాలు కేవలం డ్రైవింగ్ లోపాలు మాత్రమే కాకుండా.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నట్లుగా కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ద్విసభ్య ధర్మాసనం స్పందించింది. రోడ్ల పక్కన అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన దాబాలు, టీ దుకాణాలు, లారీ పార్కింగ్ కేంద్రాలు ప్రమాదాలకు కారణమని పేర్కొంది. అదే సమయంలో రహదారుల నిర్వహణలో కాంట్రాక్టర్లు, స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా పేర్కొంది.
రోడ్లపై గుంతలు, లైటింగ్ లేకపోవడం, రోడ్డు పక్కన సరైన రక్షిత గోడలు లేకపోవడం వల్లే ప్రమాదాల తీవ్రత మరింత పెంచుతున్నట్లుగా అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఏపీ, రాజస్థాన్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా రహదారుల పరిస్థితిపై, భద్రతా చర్యలు, ప్రమాదాలకు కారణాలపై పూర్తి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. రోడ్ల పక్కన అనుమతి లేకుండా ఉన్న దాబాలు, హోటళ్లు, వర్క్‌షాప్‌లు ఎన్ని ఉన్నాయో సమగ్రంగా సర్వే చేయాలని ఆదేశించింది. రహదారుల నిర్మాణం, నిర్వహణ విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అన్న అంశంపై సైతం దృష్టి సారించింది. ప్రమాణాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రోడ్ల నిర్వహణ అనేది నిర్మాణ మాత్రమే కాదని.. ప్రజల భద్రతకు సంబంధించిందని ధర్మాసనం స్పష్టం చేసింది.