న్యూఢిల్లీ: బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేసిన ఉత్తరప్రదేశ్ సర్కార్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమానవీయంగా, అక్రమంగా ఆ చర్యలు చేపట్టినట్లు కోర్టు పేర్కొన్నది. యూపీ సర్కారు, ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలను కోర్టు తీవ్రంగా ఖండించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్వల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం.. ఇండ్ల కూల్చివేత కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. దేశంలో ఓ చట్టం ఉందని, పౌరుల నివాసాలను ఆ రీతిలో కూల్చడం సరైంది కాదు అని కోర్టు పేర్కొన్నది.
యూపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తమ అంతరాత్మను షాక్‌కు గురిచేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. నివాస హక్కు అనేది ఒకటి ఉందని, దీని కోసం కనీస చట్టాలను పాటించాలని సుప్రీం ధర్మాసనం చెప్పింది. ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణమే ఆరు వారాల్లోగా పది లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
గతంలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన బుల్డోజర్ చర్యలను ఖండిస్తూ యూపీ సర్కార్‌ను అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా విమర్శించింది. ఎటువంటి లీగల్ చర్యలు చేపట్టకుండా ఇండ్లను కూల్చడం సమంజసం కాదని పేర్కొన్నది. ఇది షాకింగ్, తప్పుడు సంకేతాలు పంపినట్లు కోర్టు తెలిపింది. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌తో లింకు వారికి చెందిన ఇండ్లు అని తప్పుడు భావనతో కూల్చివేతలకు పాల్పడినట్లు పిటీషనర్ తరపున న్యాయవాది ఆరోపించారు. 2023లో జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను హతమార్చిన విషయం తెలిసిందే.
అడ్వకేట్ జుల్ఫీకర్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మద్‌తో పాటు ఇతరులు వేసిన పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇండ్ల కూల్చివేతలను ప్రశ్నిస్తూ దాఖలైన పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.