న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ‘అధికారులను నియమించకుండా ట్రిబ్యునళ్లను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తున్నద’ని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునళ్ల ప్రిసైడింగ్ అధికారులతో పాటు జ్యుడిషియల్, టెక్నికల్ సభ్యులకు తీవ్ర కొరత ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఈ నెల 13లోగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్సీఎల్టీ, డీఆర్టీ, టీడీఎస్ఏటీ వంటి కీలక ట్రిబ్యునళ్లలో దాదాపు 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణను కోరుకోవడం లేదని వ్యాఖ్యానిస్తూ వచ్చే సోమవారంలోగా కొన్ని నియామకాలైనా చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ గడువును నిర్దేశించింది. ఈ బెంచ్‌లో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు కూడా ఉన్నారు. గతంలో కొంతమందిని నియమించామని చెప్పారని, వారిని ఎక్కడ నియమించారని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతాను బెంచ్ ప్రశ్నించింది. కోర్టు తీర్పులపై ప్రభుత్వానికి గౌరవం లేదని తమకు అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఎస్జీకి చీఫ్ జస్టిస్ మూడు ఆప్షన్లు ఇచ్చారు. అవి… ఒకటి- ట్రిబ్యునళ్ల సంస్కరణ చట్టాన్ని నిలిపివేసి, నియామకాలను చేపట్టడం. రెండు- కోర్టే ట్రిబ్యునళ్లను మూసివేయడం. మూడు-కోర్టే స్వయంగా ట్రిబ్యునళ్లకు నియామకాలు చేయడం. మరో మార్గం ఏమిటంటే ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం కింద విచారణ చేపట్టడమని సీజేఐ చెప్పారు. ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టంపై కూడా బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మేం ఒక చట్టాన్ని రద్దు చేస్తే అలాంటిదే మరొకటి వస్తున్నదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టంపై సవాల్
ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం, 2021లో పలు ప్రొవిజన్ల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ తాజాగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసిం ది. గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన ఆర్డినెన్స్‌లోని అంశాలనే ఈ చట్టంలో కేంద్రం మళ్లీ తెచ్చిందని పిటిషనర్లు పేర్కొన్నారు.