న్యూఢిల్లీ: వయోజనులైన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకుంటే వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాంటి సంతానాన్ని బయటకు వెళ్లగొట్టవచ్చని కీలక తీర్పు వెలువరించింది. వయోవృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించడంలో వారి పిల్లలు విఫలమైన పక్షంలో వారిని ఆస్తి నుంచి గెంటివేసే అధికారం ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007’ ప్రకారం ట్రిబ్యునల్‌కు ఉంటుందని స్పష్టంచేసింది.
తమ జ్యేష్ట కుమారుడిని ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించాలని ఓ 80 ఏండ్ల వృద్ధుడు, 78 ఏండ్ల అతని భార్య చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. వయోవృద్ధులకు సంరక్షణ, వారి భద్రతకు భరోసానిచ్చేందుకే ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ చట్టం 2007’ను రూపొందించారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో చట్టంలోని నియమ నిబంధనలను, లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. ముంబైలోని రెండు ఇండ్లను తన స్వాధీనంలోకి తీసుకున్న ఆ వృద్ధుల కుమారుడు వారిని వాటిలో నివాసముండకుండా అడ్డుకున్నాడు.
ఈ విధంగా కుమారుడు తన తల్లిదండ్రులను వారి ఆస్తికి దూరం చేయడం ద్వారా తన చట్టబద్ధమైన బాధ్యతలను ఉల్లంఘించాడని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తొలుత ఈ కేసుపై విచారణ జరిపిన ట్రిబ్యునల్.. వృద్ధులకు వారి ఆస్తిని అప్పగించాలని, నెలకు రూ.3000 చొప్పున మెయింటెనెన్స్ కింద చెల్లించాలని కుమారుడిని ఆదేశించింది. అయితే, వారి కుమారుడు కూడా వయోవృద్ధుడైనందున అతడిని ఆస్తి నుంచి వెళ్లిపోమనే అధికారం ట్రిబ్యునల్‌కు లేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు వాదనను సుప్రీంకోర్టు తప్పు పడుతూ ఆ తీర్పును తోసిపుచ్చింది.