న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు పెరిగిపోతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వీధి కుక్కల ప్రవేశాన్ని నిరోధించడానికి అన్ని విద్యా సంస్థలు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బస్సు డిపోల వద్ద్ట తప్పనిసరిగా కంచె ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. వీధి కుక్కల బెడదపై సుమోటో కేసు విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రజలు అధికంగా సందర్శించే అటువంటి ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను పట్టుకుని జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనల ప్రకారం వ్యాక్సినేట్, స్టెరిలైజ్ చేసి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షెల్టర్లలో వాటిని విడిచిపెట్టాల్సిన బాధ్యత స్థానిక సంస్థల యంత్రాంగాలదేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
అలా పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసిన తర్వాత ఎక్కడ పట్టుకున్నారో అక్కడే తిరిగి వదిలేయరాదని కూడా ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ ప్రాంగణాలలో వీధి కుక్కలు ఉండేందుకు వీలుగా షెల్టర్లు కాని ఫీడింగ్ జోన్లు కాని ఉండకుండా స్థానిక ప్రభుత్వాలు తరచు తనిఖీలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ధర్మాసనం తన తీర్పును చదివిన వెంటనే ఈ కేసులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు ఆనంద్ గ్రోవర్, కరుణా నంది ఉత్తర్వులపై సంతకం పెట్టేముందు తమ వాదనలను పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు. వీధి కుక్కలను తొలగిస్తే మళ్లీ అదే ప్రదేశంలో అవి వచ్చి ఉంటాయని నంది హెచ్చరించారు. అయితే ఈ కేసుపై మళ్లీ విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది.
ప్రభుత్వ రహదారులు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై పశువులు, ఇతర జంతువుల సంచారం పెరగడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం సమాంతరంగా కొన్ని ఆదేశాలు జారీచేసింది. ఈ విషయమై రాజస్థాన్ హైకోర్టు తీసుకున్న వైఖరిని ప్రస్తావిస్తూ హైవేలు, ప్రధాన రోడ్లపైన కనిపించే అలాంటి జంతువులను తొలగించేందుకు అన్ని శాఖలు ఉమ్మడిగా సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.