న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్య స్థాయిపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కులు ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు, సీనియర్ న్యాయవాదులు వర్చువల్గా విచారణలకు హాజరు కాకుండా ఎందుకు కోర్టులో ప్రత్యక్షంగా హాజరవుతున్నారని ప్రశ్నించింది.
ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితి చాలా ఘోరంగా ఉందని వ్యాఖ్యానించిన జస్టిస్ పీఎస్ నరసింహ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ఉండగా సీనియర్ న్యాయవాదులు ప్రత్యక్షంగా ఎందుకు హాజరవుతున్నారని ప్రశ్నించారు. దయచేసి ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఈ వాయు కాలుష్యం మనుషులకు శాశ్వతంగా నష్టం చేస్తుందని ఆయన సీనియర్ న్యాయవాదులకు సూచించారు. ఈ కాలుష్యానికి మాస్కులు కూడా సరిపోవని, తాము ఈ విషయం గురించి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో చర్చిస్తామని ఆయన తెలిపారు.