Supreme Court : నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ (Pegasus) వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు (Supreme Court) లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్‌ను కలిగిఉండటం తప్పులేదని ఈ సందర్భంగా కోర్టు స్పష్టంచేసింది. అయితే ఆ స్పైవేర్‌ను ఎలా, ఎవరిపై వినియోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పెగాసస్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
ఈసందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్ స్పైవేర్‌ను తను ఉపయోగిస్తోందా.. లేదా..? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సాంకేతిక నిపుణుల బృందం దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకు ఆ నివేదిక ఊసే లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ నివేదికను వెంటనే బయటపెట్టాలని కోరారు.
దాంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే తప్పేముంది. అయితే దాన్ని ఎవరిపైన వినియోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా దేశ వ్యతిరేక శక్తులపై దాన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. కానీ జాతి వ్యతిరేక శక్తులకు, ఉగ్రవాదులకు గోప్యత హక్కు ఉండదు. సామాన్య పౌరుల గోప్యతకు మాత్రం మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం’ అని వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావించింది. ప్రస్తుతం దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసని, మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే వారికి సమాచారం అందిస్తాం. అంతేతప్ప వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్‌గా ఈ నివేదిక మారకూడదు’ అని ధర్మాసనం పేర్కొంది.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ ‘పెగాసస్’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు ఎన్ఎస్వో విక్రయిస్తుంటుంది. అయితే ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. వారిలో రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు తెలిపింది. ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే పెగాసస్‌పై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను రూపొందించింది.