Supreme Court : ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ ఉపయోగించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దొంగ ఓట్లను అడ్డుకునేందుకు వీటిని వినియోగించేలా చూడాలంటూ బీజేపీ నేత, లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ), కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ జరిపింది.
ఈసీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ అంశాన్ని తాజా అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగా విచారణకు పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చెప్పబోయే తీర్పు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నుంచి వర్తించవచ్చని కోర్టు తెలిపింది. ఈ పిల్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై ఎన్నికల సంఘాన్నే సంప్రదించాలని పిటిషనర్‌కు మొదట సూచించింది. అయితే, దీన్ని ఈ ఎన్నికల కోసం పరిశీలించాల్సిన అవసరం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించింది. అలాగే, రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ ప్రోటోకాల్ వర్తిస్తుందా లేదా అనేది కూడా పరిశీలిస్తామని కోర్టు వివరించింది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ సహా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అందుకే, ఈ ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్ ఎన్నికల కోసం ఈ పిల్‌ను పరిశీలిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఇక.. ప్రతి ఎన్నికల్లో దొంగ ఓట్ల అంశం తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఏదో ఒక గుర్తింపు కార్డు ఆధారంగా ఓటర్లకు ఓటు వేసు అవకాశం కల్పిస్తున్నారు. దీని బదులు ఆధార్‌తో అనుసంధానమై ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ బయోమెట్రిక్ ఆధారంగా ఓటు వేసే అవకాశం కల్పించాలని, దీనివల్ల దొంగ ఓట్లను నివారించవచ్చని పలువురు రాజకీయవేత్తలు ఎప్పటినుంచో అంటున్నారు.