న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అక్రమ, అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బిల్డర్లు, నిర్మాణదారులు, అధికారులు పాటించాల్సిన చర్యలపై మంగళవారం కీలక సూచనలు చేసింది. నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
మీరట్లో అనుమతిలేని వాణిజ్య భవనాన్ని కూల్చివేయాలని అలహాబాద్ హైకోర్టు 2014లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాజేంద్ర కుమార్ బర్జాత్య అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. అక్రమ నిర్మాణాలపై చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేస్తూ 36 పేజీల తీర్పు ఇచ్చింది.