న్యూఢిల్లీ, మే 5: సమాజానికి నీతి బోధలు తమ పని కాదని, చట్టాన్ని కచ్చితంగా పాటించటమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ అప్పీల్ విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ ఇద్దరు కుమారులకు విషమిచ్చి, తానూ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
ఈ ఘటనలో కుమారులు చనిపోగా, ఆమె 20 ఏండ్లపాటు శిక్ష అనుభవించింది. ఆమెపై ఇతర కేసులేవీ లేకపోతే వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. నైతికంగా ఆమె చేసినది క్రూరమైన నేరమన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.