Bilkis Bano | బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటం మతి లేని చర్య అని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం కూడా సమర్థించటాన్ని తప్పు పట్టింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని శిక్షాకాలం పూర్తి కాకుండానే విడుదల చేయటానికి కారణాలేమిటని నిలదీసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటం మతి లేని చర్య అని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని శిక్షాకాలం పూర్తి కాకుండానే విడుదల చేయటానికి కారణాలేమిటని నిలదీసింది. సమాజాన్ని ప్రభావితం చేసే అమానుష నేరాలకు సంబంధించిన కేసుల్లో శిక్షను తగ్గించాలనుకున్నప్పుడు ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోరా? అని ప్రశ్నించింది. నేరస్థులకు ఉపశమనం కల్పించటమన్నది రాష్ట్ర ప్రభుత్వ అవివేకమైన చర్య అని కడిగిపారేసింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం కూడా సమర్థించటాన్ని తప్పు పట్టింది. నేరస్థులకు ఏ ప్రాతిపదికన పెరోల్ మంజూరు చేశారని నిలదీసింది. ‘ఇది కేవలం సెక్షన్ 302(హత్య) కేసు మాత్రమే కాదు.
సామూహిక హత్యలు, సామూహిక లైంగిక దాడి జరిగిన కేసు. ఒక హత్యను నర మేధంతో కూడా పోల్చలేము’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నేరతీవ్రతను దృష్టిలో పెట్టుకోవాలి కదా అని జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. శిక్షా కాలం ముగియకమునుపే దోషులు విడుదల కావటంపై బాధితురాలు బిల్కిస్బానోతోపాటు మరికొందరు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ జోసఫ్ ఘాటుగా స్పందించారు. ‘దోషులను విడుదల చేసే ముందు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని అంటున్నారు.. నేర తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మెదడును ఉపయోగించాలి కదా? నేరస్థులకు ఉపశమనం కల్పించటంలో గుజరాత్ ప్రభు త్వం వివేకాన్ని ఉపయోగించిందా?’ అని నిలదీశారు.
ఈ నిర్ణయం తీసుకోవటానికి ఉన్న ఆధారమేంటి? అని ప్రశ్నించారు. దోషులు తమ జీవితంలో మిగిలిన భాగమంతా జైలులోనే గడపాలని ఆదేశాలున్న సంగతిని గుర్తు చేశారు. ‘నేడు బిల్కిస్ బానో కావచ్చు రేపు మీరో, నేనో కావచ్చు’ అంటూ ప్రమాణాలనేవి నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. ‘మీరు కారణాలు చెప్పకపోతే మా సొంత నిర్ణయాలు మేం తీసుకుంటాం’ అని చెప్పారు. ఈ ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేయాలని గుజరాత్, కేంద్రం నిర్ణయించిట్టు తెలిసిం ది. తదుపరి విచారణ మే 2న జరగనుంది.
బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యేతో దోషి చెట్టపట్టాల్
2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఆ సమయంలో ఆమె గర్భిణి. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్షాకాలాన్ని తగ్గించింది. గతేడాది ఆగస్ట్ 15న దోషులు విడుదలయ్యారు. విడుదలైన దోషుల్లో ఒకడు గత నెల గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవటం గమనార్హం.