Supreme Court : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత నెల 20న భారీ నిరసన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో పలువురు విద్యార్థులతోపాటు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి ప్రభుత్వం అదనపు బలగాల్ని ఉపయోగించిందన్న ఆరోపణలున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
దీనిపై విచారించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి అధ్యక్షత వహించగా, పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవి శంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ షాలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ రిటైర్డ్ డీజీపీ డా.ఎల్ఆర్ బిష్ణోయ్ సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల నిరసన సందర్భంగా వారిపై జరిగిన లాఠీఛార్జి, ఎలక్ట్రిక్ బ్యాటన్ల ప్రయోగం, పెల్లెట్ల వినియోగం, టియర్ గ్యాస్ ప్రయోగం వంటి అంశాలపై ఈ కమిటీ విచారణ జరుపుతుంది.
సరైన హెచ్చరికలు లేకుండానే విద్యార్థులపై వీటిని ప్రయోగించినట్లు ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో నిఘా పేరుతో విద్యార్థుల ప్రైవసీకి భంగం కలిగిందా లేదా అనే విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. అలాగే, నిరసన సందర్భంగా జరిగిన హింస, దాడులు, వేధింపులు, లైంగికపరమైన దాడులపై కూడా కమిటీ విచారణ జరుపుతుంది. గాయపడిన వారికి సరైన వైద్యం అందించారా.. ఆర్థిక సాయం ఏమైనా చేశారా.. అనే అంశాలపై కూడా ఆరా తీస్తుంది. ఇదే సమయంలో పోలీసులు, ఇతర భద్రతా బలగాలపైకి నిరసనకారులు, అసాంఘిక శక్తులు జరిపిన దాడి అంశంపై కూడా కమిటీ విచారణ జరుపుతుంది.
నిరసన సందర్భంగా జరిగిన హింస, ఘర్షణలో జరిగిన పబ్లిక్, ప్రైవేటు ఆస్తుల వివరాలు సేకరణ, దాడుల్లో గాయపడ్డ భద్రతా సిబ్బందికి అందిన సాయంతోపాటు మహిళలపై జరిగిన దాడులు, లైంగిక దాడులపై కూడా విచారణ జరపబోతుంది. ఈ విచారణ కోసం అవసరమైన సీసీటీవీ కెమెరా వీడియోల్ని కమిటీకి అందించాలని సుప్రీంకోర్టు అధికారుల్ని ఆదేశించింది. బాధితుల నుంచి ఫిర్యాదుల్ని కూడా కమిటీ స్వీకరిస్తుంది.