న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వల్ల తీవ్ర పర్యవసానాలు ఉంటాయని సుప్రీం కోర్టు బుధవారం చెప్పింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. ఏ వ్యవస్థకూ అపరిమిత అధికారం ఉండదని స్పష్టం చేసింది. వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న సర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ బాగ్చి మాట్లాడుతూ, 7 రకాల పత్రాలు చెల్లుతాయని ఫారం -6 చెప్తున్నదన్నారు. కానీ సర్ ప్రక్రియ కోసం ఓటర్లను 11 పత్రాలను ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. తనకు నచ్చినట్లుగా కొన్ని పత్రాలను కలపడానికి లేదా తొలగించడానికి ఈసీకి అధికారం ఉందా? అని అడిగారు. ఈసీ తరపున రాకేశ్ ద్వివేది వాదనలు వినిపిస్తూ, అధికరణ 326కు అనుగుణంగానే ఈసీ వ్యవహరిస్తున్నదన్నారు.