Supreme Court | పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఎల్వోలకు వస్తున్న బెదిరింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఓ కేసు విచారణ సమయంలో ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘పరిస్థితి మరింత దిగజారితే.. పోలీసులను మోహరించడం తప్ప వేరే మార్గం ఉండదు’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బూత్ లెవల్, ఇతర అధికారులను బెదిరించడం లాంటి సమస్యను పరిష్కరించేందుకు తమకు అన్ని రాజ్యాంగం పరంగా అన్ని అధికారాలు ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘దీన్ని పరిష్కరించాలని, లేకపోతే ఈ పరిస్థితులు అరాచకానికి దారి తీయొచ్చు’ అని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. బెంగాల్లో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఈసీ సోమవారం ఐదుగురు సీనియర్ అధికారులను స్పెషల్ రోల్ అబ్జర్వర్లుగా (SRO) నియమించింది. ఈ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈసీ పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ కుమార్ రవి కాంత్ సింగ్‌ను ప్రెసిడెన్సీ డివిజన్‌కు ఎస్ఆర్వోగా నియమించింది. హోం మంత్రిత్వ శాఖకు చెందిన నీరజ్ కుమార్ బన్సోద్‌ను మెదినీపూర్ డివిజన్‌కు, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన కృష్ణ కుమార్ నిరాలాకు బుర్ద్వాన్ డివిజన్ బాధ్యతలు అప్పగించింది. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నవంబర్ 4న ప్రారంభం కాగా.. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 14న ప్రకటించనున్నారు.