Supreme Court | న్యూఢిల్లీ: తనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భావించిన పక్షంలో ప్రజలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని ఈడీ గ్రహించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నాగరిక్ అపూర్తి నిగం(ఎన్ఏఎన్) స్కామ్ కేసును ఛత్తీస్గఢ్ నుంచి న్యూఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఈడీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల కోసం ఉద్దేశించిన రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద రిట్ పిటిషన్ను ఈడీ ఎలా దాఖలు చేసిందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ప్రశ్నించింది.
రాజ్యాంగపరమైన పరిష్కారాలు పొందే హక్కును 32వ అధికరణ పౌరులకు కల్పిస్తుంది. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ప్రజలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఊరట పొందవచ్చు. ధర్మాసనం వ్యాఖ్యలకు స్పందించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తమ పిటిషన్ను ఉపసంహరించడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈడీకి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయంటూ రాజు చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం వెంటనే ప్రతిస్సందిస్తూ ప్రజలకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయని ఆలోచించాలని చురకలు అంటించింది.