CJI Chandrachud | న్యూఢిల్లీ, ఆగస్టు 15: మనకు లభించిన స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైనవని, ఈ హక్కుల విలువ ఏమిటో ఇటీవల మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు మనకు గుర్తు చేస్తున్నాయని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశాన్ని వదిలిపెట్టి వెళ్లగా, ఆ దేశంలో మైనారిటీగా ఉన్న హిందువులపై విస్తృతంగా దాడులు జరుగుతున్న క్రమంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సుప్రీం కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిణామాలు మనకు స్వేచ్ఛ ఎంత విలువైనదో తెలియజేస్తున్నాయని అన్నారు.
ఉద్యోగినులకు నెలసరి సెలవు
భువనేశ్వర్, ఆగస్టు 15: ఒడిశాలో ఉద్యోగినులకు ఒకరోజు నెలసరి సెలవును ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేసే ఉద్యోగినులు వేతన చెల్లింపుతో కూడిన నెలసరి సెలవును తీసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే, ఈ సెలవు ఐచ్ఛికమని తెలిపారు. కటక్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆమె ఈ ప్రకటన చేశారు. మహిళ రుతు చక్రంలోని మొదటి లేదా రెండో రోజు ఈ సెలవు తీసుకోవచ్చని వెల్లడించారు.
నర్సుపై లైంగికదాడి, హత్య
లక్నో: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన మరువక ముందే యూపీలో ఒక నర్సు సైతం హత్యాచారానికి గురైయ్యారు. ఉత్తరాఖండ్‌లోని ఒక ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న నర్సు జూలై 30న ఇంటికి చేరుకోలేదు. 8 రోజుల తర్వాత ఆగస్టు 8న తన ఇంటికి 1.5 కి.మీ దూరంలోని దిబ్డిబా గ్రామంలో యూపీ పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె తన నివాస భవనంలోకి వెళ్తుండగా, దాడి చేసి పొదల్లోకి లాక్కుపోయానని, తర్వాత లైంగిక దాడి జరిపి హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు.