(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల సమ్మతికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని న్యాయస్థానం తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలో గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోకపోతే, ఆటోమెటిక్‌గా వాటికి ఆమోదం లభిస్తుందనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని గుర్తు చేసింది. అలాంటి సంప్రదాయాన్ని తాము తీసుకురాబోమని వెల్లడించింది. కానీ, కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్‌లో ఉంచితే, కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చని వివరించింది. ఈ మేరకు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమగ్రంగా సమాధానమిచ్చింది.
1. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలేంటీ?
సమాధానం: గవర్నర్‌కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు ఉంటాయి. 1. బిల్లులకు సమ్మతి తెలియజేయడం. 2. కారణం తెలియజేసి బిల్లును రిజర్వ్‌లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం. 3. బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి వెనక్కి పంపడం. బిల్లులను వెనక్కి పంపించకుండా గవర్నర్ వాటిని తొక్కిపెట్టడాన్ని అనుమతిస్తే అది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే అవుతుంది.
2. ఆర్టికల్ 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్‌కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా?
సమాధానం: మంత్రిమండలి సలహాకు గవర్నర్ కట్టుబడాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ తన రాజ్యాంగ విచక్షణాధికారానికి లోబడి నడుచుకోవచ్చు. అంటే, బిల్లును వెనక్కి పంపడం లేదా రాష్ట్రపతికి పంపించడానికి రిజర్వ్‌లో ఉంచడం అనేది పూర్తిగా గవర్నర్ విచక్షణకు లోబడి ఉంటుంది. అయితే, ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉన్నప్పటికీ, దాన్ని అపరిమితంగా వినియోగించలేరు.
3. ఆర్టికల్ 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా?
సమాధానం: ఆర్టికల్ 200 ప్రకారం.. గవర్నర్ల విధుల నిర్వహణ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు. కానీ, కారణం లేకుండా దీర్ఘకాలంగా, నిరవధికంగా బిల్లులను పెండింగ్‌లో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించొచ్చు. రాష్ట్రపతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది.
4. ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 పూర్తిగా నిషేధిస్తుందా?
సమాధానం: అవును. అయితే, బిల్లులను దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచిన సందర్భాల్లో ఈ అంశం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.
5. గవర్నర్‌కు ఉన్న విచక్షణాధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులు విధించవచ్చా?
6. రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా?
7. రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులు విధించవచ్చా?
సమాధానం: లేదు. కానీ, పెండింగ్ బిల్లులు దీర్ఘకాలం కొనసాగితే న్యాయస్థానాలు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చు.
8. రాజ్యాంగపరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే సమయంలో ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా? ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా?
సమాధానం: గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసిన ప్రతిసారీ ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి విచక్షణకు లోబడి ప్రవర్తించవచ్చు. అవసరమైతేనే సుప్రీంను సంప్రదించవచ్చు.
9. చట్టం అమల్లోకి రాకముందే ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 కింద గవర్నర్, రాష్ట్రపతి తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైందేనా? ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులోని అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కోర్టులకు అనుమతి ఉందా?
సమాధానం: లేదు. బిల్లులు చట్టంగా మారాకే వాటిని సవాల్ చేయవచ్చు.
10. రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగబద్ధ అధికారాలు, ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 భర్తీ చేస్తుందా?
11. ఆర్టికల్ 200 కింద గవర్నర్ సమ్మతి లేకుండా రాష్ట్ర శాసన సభ చేసిన చట్టం అమల్లోకి రావొచ్చా?
12. ఆర్టికల్ 142 కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్లకే పరిమితమా? లేదా ఆర్టికల్ 142 కింద జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత సబ్స్టాండింగ్ లా లేదా రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా చెల్లుబాటు అవుతాయా?
సమాధానం: లేదు. నిర్ణీత కాలవ్యవధిలో గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోకపోతే, ఆటోమెటిక్‌గా వాటికి ఆమోదం అనేది లభించదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి సంప్రదాయాన్ని మేం తీసుకురాబోం.
13. ఆర్టికల్ 145(3) ప్రకారం.. రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్ ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరా? కాదా?
14. ఆర్టికల్ 131 కింద తప్ప కేంద్ర, రాష్ర్టాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధులను రాజ్యాంగం నిషేధిస్తుందా?
సమాధానం: ప్రస్తుత విషయానికి సంబంధించిన ప్రశ్నలు కాదు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అక్కడి చట్టసభ ఆమోదించిన 10 బిల్లులను తన వద్దనే సుదీర్ఘ కాలంగా తొక్కిపెట్టారు. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత ఏప్రిల్‌లో విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని కాలపరిమితి విధించింది. అలా గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం ఆయా బిల్లులను నోటిఫై చేసింది. ఈ క్రమంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గత మేలో సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను సంధించారు. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించవచ్చా? అని ప్రశ్నించారు. దీనిపై సీజేఐ నేతృత్వంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత సెప్టెంబర్‌లో 10 రోజులపాటు విచారణ జరిపింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని పేర్కొంది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా కోర్టు రద్దు చేసింది.