Supreme Court | బీహార్‌లో ఓటర్ల జాబితాను సవరించాలనే ఎన్నికల కమిషన్ (EC) నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఏడు ధ్రువీకరణ పత్రాలకంటే.. ప్రస్తుతం 11 పత్రాలను అనుమతించడం ఓటర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ మినహా అనేక ఇతర డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకోవడాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. గతంలో బిహార్‌లో నిర్వహించిన రివిజన్లో ఏడు ధ్రువీకరపత్రాలను అనుమతించారని.. ప్రత్యేక సవరణ (SIR)లో 11 డాక్యుమెంట్లను ఈసీ అనుమతి ఇస్తుందని.. దీన్ని పరిశీలిస్తే ఓటర్లకు అనుకూలంగానే కనిపిస్తుందని ధర్మాసనం తెలిపింది. ఆధార్ అనుమతించడం లేదనే పిటిషనర్ల వాదనను అర్థం చేసుకున్నప్పటికీ అనేక పత్రాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా ధర్మాసనం గుర్తు చేసింది.
అయితే, ఈ వాదనలతో పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విభేదించారు. ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. అందరికీ అందుబాటులో లేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాస్‌పోర్టులను ఉదహరించారు. బిహార్‌లో కేవలం ఒకటి నుంచి రెండుశాతం మంది వద్దే పాస్ పోస్టులు ఉన్నాయన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం 36లక్షల మందికి పాస్‌పోర్టులు ఉన్నాయని.. ఇది మంచి సంఖ్యగానే కనిపిస్తోందని చెప్పింది. ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే ధ్రువపత్రాల జాబితా రూపొందిస్తారని జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై మంగళవారం సైతం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. పౌరులను చేర్చడం, కానివారిని ఓటరు జాబితా నుంచి మినహాయించడం ఎన్నికల కమిషన్ అధికార పరిధిలోనిదని ధర్మాసనం పేర్కొంది. సర్‌లో ఆధార్, ఓటర్ కార్డును పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమన్న ఈసీ వాదనలను సమర్థించింది. పార్లమెంట్ లోపల, వెలుపల ‘సర్’ అంశంపై వివాదం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈసీ చేపట్టిన ఈ కార్యక్రమంపై విశ్వాసం కోల్పోవడమే సమస్య అని.. అంతకు మించి ఏమీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.