Suicide : అప్పుల బాధ భరించలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డారు. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి, ఆ తర్వాత దంపతులు విషం సేవించారు. గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad) లోని బగోదర (Bagodara) లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ధోల్కా ఏరియాకు చెందిన విపుల్ వాఘేలా (32), సోనల్ వాఘేలా (26) ఇద్దరు దంపతులు. వారికి కరీనా (11), మయూర్ (8), ప్రిన్సీ (5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. విపుల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. ఆటో కోసం తీసుకున్న లోన్‌కు కూడా ఈఎంఐ కట్టలేకపోయాడు.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు పిల్లలకు, భార్యకు విషమిచ్చి తాను కూడా విషం సేవించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఐదుగురిని ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే పరిశీలించిన వైద్యులు వారు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విపుల్ బంధువుల ద్వారా అతడి అప్పుల విషయం తెలుసుకున్నారు. అయితే విపుల్ ఎలాంటి సూసైడ్ నోట్ కూడా రాయకపోవడంతో ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.