Karnataka | శివమొగ్గ, డిసెంబర్ 28: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులతో ఇలాంటి పనులు ఎక్కువగా చేయిస్తున్నారని పలు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులతో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒక పక్క సీఎం సిద్ధరామయ్య హెచ్చరిస్తున్నా.. కర్ణాటకలో అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొందరు విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. సాక్షాత్తు విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప జిల్లా అయిన శివమొగ్గ, గుడ్డాల నేరాలకెరె గ్రామంలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ వీడియోలో ఇద్దరు విద్యార్థినులు పాఠశాల టాయిలెట్‌ను శుభ్రం చేయడం కన్పించింది. కర్ణాటకలో ఇది ఈ నెలలో మూడో ఘటన. స్కూల్ టీచర్లు విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించడాన్ని తల్లిదండ్రులు, పలు సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. మన టాయిలెట్లు మనమే శుభ్రం చేసుకుంటే డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని ప్రిన్సిపాల్ విద్యార్థులతో చెప్పేవారని వారు ఆరోపించారు. దీనిపై అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు దళిత సంఘర్షణ సమితి తెలిపింది. కాగా సంఘటనలకు బాధ్యులుగా స్కూల్ ప్రిన్సిపాల్ శంకరప్పను సస్పెండ్ చేస్తున్నట్టు శివమొగ్గ డిప్యూటీ డైరెక్టర్ ఆప్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ పరమేశ్వరప్ప ప్రకటించారు.