గువాహటి: మార్కులు తక్కువగా ఎందుకొచ్చాయని ప్రశ్నించినందుకు గురువునే చంపేశాడు ఓ విద్యార్థి. రాజేశ్ బారువా బెజవాడ (Rajesh Baruah Bejawada) అనే వ్యక్తిఅస్సాంలోని శివసాగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కెమిస్ట్రీ బోధించడంతోపాటు స్కూల్ నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తుండేవారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 11వ తరగతికి చెందిన ఓ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో రాజేశ్ అతడిని మందలించాడు. తల్లిదండ్రులను స్కూల్‌కి తీసుకురావలని ఇంటికి పంపించాడు.
అయితే కొంత సమయం తర్వాత మామూలు దుస్తుల్లో క్లాస్‌కు వచ్చిన అతడిని గమనించిన ఉపాధ్యాయుడు.. వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించాడు. వినకపోవడంతో అతనిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కోపానికి గురైన ఆ విద్యార్థి.. అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో రాజేశ్‌ను పొడిచాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థుల సమాచారంతో అప్రమత్తమైన స్కూలు యాజమాన్యం వెంటనే అతడిని దవాఖానకు తరలించింది. అయితే అప్పటికే రాజేశ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.