లక్నో: కాలేజీ ఫీజు చెల్లించనందుకు పరీక్ష రాసేందుకు విద్యార్థిని నిరాకరించారు. దీనిపై నిరసన తెలుపడంతో పోలీసులను రప్పించి అతడ్ని వేధించారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు నిప్పంటించుకుని మరణించాడు. (Student Burns To Death) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల ఉజ్వల్ రాణా, బుధానాలోని డీఏఏ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం పరీక్ష రాసేందుకు కాలేజీకి హాజరయ్యాడు. అయితే ఆ విద్యార్థి ఫీజు చెల్లించనందుకు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.
కాగా, విద్యార్థి ఉజ్వల్ రాణా దీనిపై నిరసన తెలిపాడు. దీంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం పోలీసులను రప్పించింది. కాలేజీకి చేరుకున్న పోలీసులు నిరసన చేస్తున్న ఉజ్వల్ రాణాను వేధించారు. ఈ నేపథ్యంలో అతడు నిప్పంటించుకున్నాడు. 70 శాతం కాలిన గాయాలైన ఆ విద్యార్థిని తొలుత స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అతడి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఉజ్వల్ ఆదివారం సాయంత్రం మరణించాడు.
మరోవైపు ఈ సంఘటన బుధానాలో కలకలం రేపింది. కాలేజీ మేనేజర్ అరవింద్ గార్గ్, ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయుడు సంజీవ్ కుమార్, ముగ్గురు పోలీసులులపై ఉజ్వల్ రాణా కుటుంబం ఫిర్యాదు చేసింది. విద్యార్థి మృతికి వారు కారణమని ఆరోపించింది. దీంతో పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.
కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఎస్ఐ నంద్ కిషోర్, కానిస్టేబుళ్లు వినీత్, జ్ఞాన్వీర్ను పోలీస్ లైన్‌కు అటాచ్ చేసినట్లు ఎస్ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులోని నిందితులపై చర్యల కోసం పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ప్రైవేట్ కాలేజీల ఫీజులు నియంత్రించాలని కోరాయి. బాధిత కుటుంబానికి కోటి పరిహారంతోపాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
Also Read:
Bengaluru jail | బెంగళూరు జైలులో ఖైదీల జల్సాపై చర్యలు.. ఉన్నతాధికారులు సస్పెండ్
Students Shoot Classmate | క్లాస్‌మేట్‌ను ఇంటికి రప్పించి.. ఇద్దరు విద్యార్థులు కాల్పులు
Delhi chokes | ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యత.. జనం నిరసన