Bengaluru | మన దేశంలో ట్రాఫిక్ జామ్ అంటే ముందుగా గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరమే. స్వల్ప దూరానికే గంటలు గంటలు వేచి చూడటం నగర పౌరులకు నిత్యం అనుభవమే. వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరుది దేశంలోనే అగ్రస్థానం. ఇక్కడ కిలోమీటరు దూరానికి గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్ కష్టాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. అలా, ఇటీవలే ఓ నెటిజన్ బెంగళూరు ట్రాఫిక్ (Bengaluru Traffic)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
అర్పిత్ అరోరా (Arpit Arora) అనే నెటిజన్ ఈనెల 5న ఎక్స్‌లో ఓ ట్వీట్ పెట్టాడు. దాదాపు రెండు గంటల పాటు తాను ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినట్లు చెప్పారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పీక్ ట్రాఫిక్ ఫుడ్ డెలివరీకి మాత్రం ఎలాంటి ఆటంకం కలిగించకపోవడం. రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అతడు.. అక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్ చేయగా 10 నిమిషాల్లోనే డెలివరీ అయినట్లు (Food Delivery Arrives In 10 Minutes) చెప్పారు. అయితే, ఫుడ్ తినడం అయిపోయినా కూడా ట్రాఫిక్ మాత్రం ముందుకు కదలడం లేదంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘బెంగళూరు మహానగరంలోనే ఇలాంటివి సాధ్యం’ అంటూ చమత్కరిస్తున్నారు.
Peak Bengaluru moment is when you are stuck in traffic for almost two hours so you order dinner from your car and it gets DELIVERED IN 10 MINUTES 😭😭(khana khatam lekin ye traffic nahi) pic.twitter.com/zyvzHl7pNK
— Arpit Arora (@speakingofarpit) November 5, 2024
కాగా, సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ కష్టాల (Bengaluru Traffic) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో బెంగళూరుది రెండో స్థానం. ఇక్కడ 2-3 కిలోమీటర్ల ప్రయాణానికే గంటల సమయం పడుతోంది. పని మీద బయటకు వెళ్లాలంటనే ట్రాఫిక్ బారులను చూసి పౌరులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకునేందుకు అనేకమంది నగర వాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుసరిస్తున్నారు. నగరంలోని 95 శాతం మంది వాహనాల యజమానులు కూడా ఇదే చెబుతున్నారని పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Also Read..
Virat Kohli | ముంబై రెస్టారెంట్లో కోహ్లీ – అనుష్క సందడి.. ఫొటోలు వైరల్
Sidhu Moose Wala | సిద్ధూ మూసేవాలా సోదరుడిని చూశారా.. ఫొటో వైరల్