Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఎనిమిదవ రోజూ గాలి నాణ్యత అధ్వానంగా మారింది. పలు చోట్ల ఏక్యూఐ (Air Quality Index) లెవల్స్ 400గా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) ప్రకారం.. శుక్రవారం ఉదయం ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి సూచీ 383గా నమోదైంది. బవానా ప్రాంతంలో గాలి సూచీ 440గా, ముండ్కాలో 428, న్యూ మోతీ బాగ్లో 427, రోహిణి ప్రాంతంలో 439, పంజాబీ బాగ్లో 406, ఆర్కే పురంలో 406గా నమోదైంది. వీటితోపాటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ లెవల్స్ 400 కంటే ఎక్కువగానే నమోదైంది.
మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరోవైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు. యమునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉన్నది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 367కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో ఇది 400కు చేరింది. ఇటీవలే కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులతో దవాఖానలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు తెలిపారు.
ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో కేంద్రం చర్యలు
దేశ రాజధాని నగరం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పతనమవుతుండటంతో కేంద్రం కఠిన చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంట వ్యర్థాలు తగులబెట్టినవారికి విధించే జరిమానాను రెట్టింపు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, రెండు ఎకరాల కన్నా తక్కువ భూమి గల రైతులపై పర్యావరణ నష్టపరిహారం రూ.5 వేలు విధించవచ్చు. రెండెకరాల నుంచి ఐదు ఎకరాల లోపు భూమి కలవారికి రూ.10 వేలు, ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి కలవారికి రూ.30 వేల వరకు విధించవచ్చు.
ఇతర నగరాల్లో గాలి నాణ్యత ఇలా..
ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ గాలి నాణ్యత సూచీ మోడరేట్ కేటగిరీలో నమోదైంది. ముంబై (Mumbai)లో ఏక్యూఐ లెవల్స్ 123గా, పూణెలో 114గా రికార్డయ్యాయి. రెండు నగరాల్లో శనివారం వరకు అవి ‘మధ్యస్థంగా’ ఉండే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక కోల్కతాలో ఏక్యూఐ 163గా కొనసాగుతోంది. అయితే, ట్రాఫిక్కు పేరు గాంచిన బెంగళూరు మహానగరంలో గాలి నాణ్యత సూచీ ‘సంతృప్తికరమైన’ కేటగిరీలో నమోదవడం విశేషం. నగరంలో శుక్రవారం ఉదయం ఏక్యూఐ 81గా ఉంది. లక్నోలో 159, పాట్నాలో 184, అహ్మదాబాద్లో 62గా ఏక్యూఐ లెవల్స్ నమోదయ్యాయి.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
Also Read..
Elon Musk | అమెరికాలో నాకు ఎలాంటి భవిష్యత్తూ కనిపించట్లేదు.. ట్రంప్ గెలుపుపై మస్క్ కుమార్తె ఆందోళన
Sidhu Moose Wala | సిద్ధూ మూసేవాలా సోదరుడిని చూశారా.. ఫొటో వైరల్
Elon Musk | వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతారు.. కెనడా ప్రధాని ట్రూడోపై జోష్యం చెప్పిన ఎలాన్ మస్క్