Elon Musk | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై గెలుపొందారు. ట్రంప్ గెలుపు కోసం ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో ట్రంపే గెలవడంతో.. టెస్లా బాస్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. అయితే, ట్రంప్ గెలవడంతో ఆయన కుమార్తె వీవియన్ జెన్సా విల్సన్ (Vivian Wilson) మాత్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. అమెరికాలో తనకు ఎలాంటి భవిష్యత్తూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ట్రంప్ విజయంతో అమెరికాలో ఇక తనలాంటి ట్రాన్స్జెండర్లకు భవిష్యత్తు లేదని తేలిపోయిందని పేర్కొంది. ఇటీవలి కాలంలో దేశం విడిచి వెళ్లాలనే ఆలోచన తరచూ తన మదిలోకి వచ్చేదన్నారు. ట్రంప్ గెలిచాడనే వార్త విన్నాక తన ఆలోచనకు మరింత స్పష్టత వచ్చిందని వివరించారు. ‘ట్రంప్ నాలుగేళ్లే అధ్యక్షుడిగా ఉండనున్నాడు. లింగమార్పిడి వ్యతిరేక నిబంధనలు ఒక్కసారిగా అమల్లోకి రాకపోయినా.. వాటిని కావాలని ఓటేసినవారు అంత తొందరగా మారరుగా. ట్రాన్స్ జెండర్లకు అమెరికాలో భవిష్యత్తు లేదనే స్పష్టత వచ్చింది’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ థ్రెడ్‌లో ఓ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
జేవియర్.. మస్క్ తొలి భార్యకు కలిగిన సంతానం. 2000లో జస్టిస్ విల్సన్‌ను మస్క్ పెళ్లాడాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థల కారణంగా ఆమెకు 2008లో విడాకులు ఇచ్చేశాడు. అయితే ఈ జంటకు ఏడు మంది సంతానం. అందులో జేవియర్ ఒకరు. పుట్టుకతో పురుషుడిగా పుట్టిన జేవియర్ ఆ తర్వాత 18 ఏళ్లు నిండాకా అమ్మాయిగా తన లింగాన్ని మార్చుకున్నారు. అంతేకాదు తనకు తండ్రితో ఎలాంటి సంబంధం ఉండకూడదని చట్టపరంగా తన పేరును కూడా మార్చుకుంది. తన తండ్రితో కానీ, ఆయన ఆస్తితో కానీ, ఆయనకు సంబంధించిన వేటితో తనకు సంబంధం లేకుండా తన పేరు మార్చుకోవడానికి అనుమతినివ్వాలని కోర్టుకెక్కిన మస్క్ కూతురు తన అసలు పేరు జేవియర్ అలెగ్జాండర్ మస్క్ (Xavier Alexander Musk) తీసేసి వీవియన్ జెన్సా విల్సన్‌గా తన గుర్తింపును మార్చుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె మస్క్‌కు దూరంగా ఉంటోంది. అయితే, ఈ విషయం ట్విట్టర్ బాస్‌ను ఎంతో బాధించిందట.
ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర ఆధారంగా వాల్టర్ ఐసాక్సన్ (Walter Isaacson) ఓ పుస్తకాన్ని రాశారు. అందులో ‘నా కుమార్తె సోషలిజం నుంచి పూర్తిగా కమ్యూనిజం వైపు మళ్లింది. డబ్బున్న ప్రతీ ఒక్కరూ చెడ్డవారని భావించే స్థితికి చేరుకుంది. కన్నబిడ్డతో విబేధాలు నన్నెంతో బాధించాయి. కూతురితో సఖ్యత కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా తను నాతో ఉండేందుకు అంగీకరించలేదు. తొలి సంతానం మరణం తర్వాత ఇంతగా వేదన మిగిల్చింది మరొకటి లేదు’ అని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన కూతురు ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి కారణం ఆమె చదువుకున్న స్కూలేనని మస్క్ అప్పట్లో ఆరోపించారు.
Also Read..
Elon Musk | వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతారు.. కెనడా ప్రధాని ట్రూడోపై జోష్యం చెప్పిన ఎలాన్ మస్క్
Sunita Williams | క్షీణించిన సునీతా విలియమ్స్ ఆరోగ్యం..? క్లారిటీ ఇచ్చిన నాసా
Sidhu Moose Wala | సిద్ధూ మూసేవాలా సోదరుడిని చూశారా.. ఫొటో వైరల్