Stray Dogs | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కళాశాల విద్యార్థిని (college student)పై వీధి కుక్కలు (Stray Dogs) దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు 17 కుట్లు వేయాల్సి వచ్చింది.
అలెన్ హౌస్ రుమా కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న 21 ఏండ్ల వైష్ణవి సాహు (Vaishnavi Sahu) అనే విద్యార్థిని ఈనెల 20న కాలేజీ ముగిశాక ఇంటికి బయల్దేరింది. అయితే, మార్గం మధ్యలో శ్యామ్ నగర్ (Shyam Nagar) ప్రాంతంలో కొన్ని వీధికుక్కలు, కోతులు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన వైష్ణవిపై కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో వైష్ణవి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు విద్యార్థిని ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆమెను రోడ్డుపై పడేసి తీవ్రంగా గాయపరిచాయి. విద్యార్థిని కేకలు విన్న స్థానికులు కర్రలతో పరుగెత్తుకొచ్చి కుక్కలను తరిమికొట్టారు.
అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అల్లాడుతున్న వైష్ణవిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్సచేశారు. వైష్ణవి ముఖంపై ఏకంగా 17 కుట్లు పడ్డాయి. ఈ ఘటనతో విద్యార్థిని కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కుక్కలన్నింటినీ పట్టుకుని షెల్టర్లకు తరలించాలని విజ్ఞప్తి చేసింది. తన బిడ్డలా ఇంకెవరూ బాధపడకూడదని పేర్కొంది. వెంటనే కుక్కలన్నింటినీ వీధుల్లో నుంచి తరలించాలని డిమాండ్ చేసింది. వీధి కుక్కల స్టెరిలైజేషన్, వాటిని షెల్టర్లకు తరలించడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొనసాగుతున్న చర్చల మధ్య ఈ సంఘటన జరిగింది.
వీధికుక్కలను స్టెరిలైజ్ చేసి.. రిలీజ్ చేయండి
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇటీవలే సంచలన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కల కారణంగా పలువురు, ముఖ్యంగా చిన్నారులు కుక్క కాట్లకు గురవుతున్నారని, రేబిస్ వ్యాధి బారిన పడుతున్నందున వాటిని సాధ్యమైనంత త్వరగా షెల్టర్ కేంద్రాలకు తరలించాలంటూ సూచించింది. అయితే, ఈ ఆదేశాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వులను సుప్రీం సవరించింది. స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ తర్వాత వీధి కుక్కలను వాటిని తెచ్చిన వీధులలోనే విడిచిపెట్టాలని మున్సిపల్ అధికారులను జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. రేబిస్ సోకిన లేదా ఉన్మాద లక్షణాలు ప్రదర్శిస్తున్న వీధి కుక్కలను మాత్రం షెల్టర్ హోంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్కలకు వీధుల్లో ప్రజలు ఆహారం పెట్టడాన్ని అనుమతించబోమని, వీధికుక్కల కోసం ఆయా ప్రాంతాలలో ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపింది.
Also Read..
TikTok | మళ్లీ భారత్‌లోకి టిక్ టాక్..? ప్రభుత్వ వర్గాలు ఏం చెప్పాయంటే..?
Tejashwi Yadav | ప్రధాని మోదీపై అభ్యంతరకరపోస్ట్.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
Cloudburst | ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్.. బాలిక మృతి.. అనేక మంది మిస్సింగ్