TikTok | చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) సేవలు భారత్‌లో మళ్లీ అందుబాటులోకి వచ్చాయంటూ (Chinas TikTok back in India) జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. ఈ మేరకు ఆ వార్తలను తీవ్రంగా ఖండించాయి. అందులో ఏమాత్రం నిజం లేదని వెల్లడించాయి.
టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశాయి. టిక్‌టాక్‌ను అన్‌బ్లాక్ చేసేలా భారత ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని తెలిపాయి. దీనిపై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవమని, తప్పుదోవ పట్టించే కథనాలేనని పేర్కొన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్‌లిస్ట్‌లోనే ఉంచాయని తెలిపాయి.
భారతీయ, చైనా సైనిక బలగాల మధ్య గల్వాన్ ఘర్షణ తర్వాత భద్రతా కారణాలు చూపుతూ భారత ప్రభుత్వం 2020లో టిక్‌టాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్ టాక్‌తోపాటు వందలాది చైనీస్ గేమింగ్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత కూడా భారత్‌లో ఏదోవిధంగా కొనసాగేందుకు శాయశక్తులా ప్రయత్నించిన టిక్ టాక్ కంపెనీ ఎట్టకేలకు 2023 ఫిబ్రవరి 28న మూతపడింది. అప్పటి నుంచి భారత్‌లో అందుబాటులో లేదు. అయితే, ట్రంప్ సుంకాల మోతతో అమెరికా-భారత్ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారతీయ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించినప్పటి నుంచి భారత్, చైనా (India-China) మధ్య సంబంధాలలో పురోగతి కనిపిస్తోంది.
భారత్‌కు ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాలను తవ్వే మిషన్ల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు చైనా గురువారం ప్రకటించింది. టియాంజిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే షాంఘై సహకార సంస్థల(ఎస్సీఓ) సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. అదే సమయంలో చైనా విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించడం ఆసక్తికరంగా మారింది. ఆయన పర్యటన అనంతరం టిక్‌టాక్ మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టబోతోందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు తాజాగా క్లారిటీ ఇచ్చాయి.
Also Read..
Tejashwi Yadav | ప్రధాని మోదీపై అభ్యంతరకరపోస్ట్.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
Cloudburst | ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్.. బాలిక మృతి.. అనేక మంది మిస్సింగ్
Ganesh Idol: ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో గణేశుడి విగ్రహం.. హైదరాబాద్ ఉప్పుగూడలో మండపం ఏర్పాటు