Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఇరాన్ ఓడరేవులపై దీర్ఘకాలంపాటు దిగ్బంధనం కొసాగించాలని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఓ దశలో ఏకంగా 120 డాలర్లు దాటింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, రూపాయి విలువ పతనం మన సూచీలపై ప్రభావం చూపాయి.
సెన్సెక్స్ ఓ దశలో వెయ్యి పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ మళ్లీ 24 వేల దిగువకు చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లు పతనమై రూ.469 లక్షల కోట్ల నుంచి రూ.464 లక్షల కోట్లకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 77,014.21 పాయింట్ల వద్ద నష్టాలతోనే ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,258.86 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 582.86 పాయింట్ల నష్టంతో 76,913.50 వద్ద స్థిరపడింది.
ఇక నిఫ్టీ 180.10 పాయింట్ల నష్టంతో 23,997.55 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువల కూడా ఓ దశలో 95 మార్కు దాటి చివరికి 94.90 కి చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటెర్నల్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా స్టాక్స్ లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 110 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 4,634 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మార్కెట్లలో ఈ పరిస్థితి పలు కారణాలు ఉన్నాయి. పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం, క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం, రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటం, ఎఫ్ఐఐల విక్రయాలు కొనసాగడం లాంటివి ప్రధానమైనవిగా చెప్పవచ్చు.