Parliament Budget Session | న్యూఢిల్లీ, మార్చి 9 : పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), ఓటర్ల జాబితాలో అక్రమాలు, మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగడం, ట్రంప్ యాంత్రాంగాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థత, వక్ఫ్ సవరణ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై కత్తులు నూరుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండవ విడత బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం పొంది ఆ ప్రక్రియను ముగించడం, మణిపూర్ బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం పొందడం, వక్ఫ్ సవరణ బిల్లుకు సభలో ఆమోదం పొందడంపై మోదీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టనున్నది. నియోజక వర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై చర్చకు పట్టు బట్టాలని డీఎంకే నిర్ణయించింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ స్వేచ్ఛా సంచారానికి అనుమతి ఇచ్చినా.. ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి.
మరోవైపు పెద్దఎత్తున డూప్లికేట్ ఓటరు గుర్తింపు కార్డుల(ఎపిక్) జారీపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించగా మూడు నెలల్లో లోపాలను సరి చేస్తామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. సోమవారం ఈసీతో భేటీ కానున్న టీఎంసీ నాయకులు కాంగ్రెస్, డీఎంకే, శివసేన(యూబీటీ) తదితర ప్రతిపక్ష పార్టీలతో కలసి పార్లమెంట్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు కూడా పార్లమెంట్ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. వక్ఫ్ ఆస్తులపై కేంద్రం అజమాయిషీని సవరణ బిల్లు పెంచుతుందని.. ఈ బిల్లును సంయుక్తంగా వ్యతిరేకించాలని ఇండియా కూటమి నాయకులు నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ వెల్లడించారు. దేశంలో స్వేచ్ఛాయత ఎన్నికలు జరగడం లేదని, ఎన్నికలను కుట్రలు, కుతంత్రాలతో నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. బడ్జెట్ మలి విడత సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.