న్యూఢిల్లీ, జనవరి 24 : శ్రీలంకలో అదానీ గ్రూప్‌నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసుకుంది. అదానీ సంస్థ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు గత ఏడాది మేలో శ్రీలంకలోని అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. కిలోవాట్‌కు రూ.7.13 చొప్పున విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం జరిగింది. విద్యుత్తు సరఫరా కోసం ఆ దేశంలోని మన్నార్, పూనెరిన్‌లో 484 మెగావాట్ల పవన విద్యుత్కేంద్రం నిర్మించాలని అదానీ సంస్థ ప్రణాళిక రూపొందించింది. అయితే, అదానీ సంస్థ సరఫరా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్న ధర కంటే చాలా తక్కువ ధరకు కొన్ని సంస్థలు విద్యుత్తును సరఫరా చేస్తున్నాయని పలువురు వాదించారు. మరోవైపు అదానీ సంస్థ విద్యుత్తు ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చిందని గత ఏడాది నవంబర్ 19న అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి.
ఆరోపణల నేపథ్యంలో అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె నేతృత్వంలోని శ్రీలంక కొత్త ప్రభుత్వం అదానీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని తాజాగా నిర్ణయించింది. అయితే, విద్యుత్కేంద్రం నిర్మాణ ప్రాజెక్టును మాత్రం రద్దు చేయలేదని, ఈ మొత్తం ప్రాజెక్టును సమీక్షించేందుకు మంత్రివర్గం ఒక కమిటీని నియమించిందని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ వార్తలపై అదానీ సంస్థ స్పందించింది. విద్యుత్కేంద్రం నిర్మాణ ప్రాజెక్టు రద్దు కాలేదని, విద్యుత్తు కొనుగోలు కోసం ఆమోదించిన టారిఫ్‌ను సమీక్షించాలని మాత్రమే కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పింది.