Floods : శ్రీలంక (Srilanka) లోని పలు ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దిత్వా తుపాను (Dhitwa cyclone) కారణంగా భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో 56 మంది మరణించినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో 21 మంది గల్లంతయినట్లు తెలిపారు. వరద ధాటికి 600కి పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జల దిగ్బంధమయ్యాయి.
వరదల్లో గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోని అనేక నగరాలు వరదలో చిక్కుకుపోవడంతో శ్రీలంక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేసింది. రైలు సర్వీసులు నిలిపివేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలోని మరిన్ని ప్రాంతాలకు భారీ వర్షం ముప్పు ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం హెచ్చరికలు చేసింది.