Congress MLA : కేరళ (Kerala) కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) రాహుల్ మామ్కుటత్తిల్ (Rahul Mamkootathil) పై అత్యాచారం కేసు నమోదైంది. ఎమ్మెల్యే రాహుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అనంతరం గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించాడని కేరళకు చెందిన ఓ యువతి సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) కు ఫిర్యాదు చేశారు.
సీఎం అదేశాల మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. తాము కొంతకాలం కలిసున్నామని, తనకు బిడ్డ కావాలని అతను బలవంతం చేశాడని, గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ మేరకు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో రికార్డ్లను, వాట్సప్ స్క్రీన్షాట్లను సమర్పించింది.
వాటి ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటత్తిల్ స్పందిస్తూ తాను ఏ తప్పూ చేయలేదన్నారు. కుట్రపూరితంగా తనపై కేసు నమోదు చేశారని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ప్రజల ముందు, న్యాయస్థానం ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అన్నారు.
ఇటీవల రాహుల్ మామ్కుటత్తిల్పై ఓ నటి కూడా ఆరోపణలు చేశారు. ఓ ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని, మూడేళ్లుగా వేధిస్తున్నాడని రీని జార్జ్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆ పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆమె వాపోయారు.
రాహుల్ పేరును ఆమె నేరుగా ప్రస్తావించనప్పటికీ బీజేపీ, సీపీఎం శ్రేణులు ఆయన ప్రమేయం ఉందని ఆరోపించాయి. ఆమె తన స్నేహితురాలేనని, ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి తాను కాదని నమ్ముతున్నానని రాహుల్ తెలిపారు. అయినా విమర్శలు ఆగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అతడి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.