వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పుల ఘటనలో నేషనల్ గార్డ్‌కు చెందిన సైనికురాలు ఒకరు మృతిచెందారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. థార్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెక్యూర్టీ రిస్క్‌గా మారుతున్న విదేశీయుల్ని కూడా డిపోర్టు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి.. వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డు సభ్యురాలిపై కాల్పులు జరిపి చంపేశాడు. ఈ ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. దీంతో ట్రంప్ సర్కారు.. వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెఢీ అయ్యింది.
సుమారు 19 దేశాలకు చెందిన వలసదారులకు జారీ చేసిన గ్రీన్ కార్డులను సమీక్షించనున్నట్లు ట్రంప్ చెప్పారు. నేషనల్ గార్డును షూట్ చేసిన ఆఫ్ఘన్ జాతీయుడిని రహమానుల్లా లకన్వాలాగా గుర్తించారు. ఈ నేపథ్యంలో థార్డ్ వరల్డ్ దేశాలకు చెందిన వారి ఇమ్మిగ్రేషన్ను నిరవధికంగా నిలిపివేయనున్నట్లు ట్రంప్ చెప్పారు. ఆ దేశాలకు చెందిన వ్యక్తులకు జారీ చేసిన గ్రీన్ కార్డులను పూర్తి స్థాయిలో సమీక్షించనున్నట్లు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎల్డో తెలిపారు. ఈ దేశాన్ని, అమెరికా ప్రజలను రక్షించడమే తమకు ముఖ్యమని ఆయన అన్నారు.
హై రిస్క్ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బురుండి, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, క్యూబా, గునియా, ఎరిత్రియా, హైతి, ఇరాన్, లావోస్, లిబియా, సియర్రా లియోన్, సొమాలియా, సుడాన్, టాగో, తుర్కమెనిస్తాన్, వెనిజులా, యెమెన్ ఉన్నాయి.