Union Budget | ఆర్థిక సుస్థిరత కోసం ఆరు కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తున్నామని తెలిపారు. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. దేశీ సెమీ కండక్టర్ రంగం వృద్ది కోసం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ సహా ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒడిశా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ కోసం ప్రత్యేక మైనింగ్ మిషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేలా చర్యలు చేపట్టామని అన్నారు. ప్రపంచస్థాయి కంటైనర్ ఉత్పత్తి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు, జౌళిరంగం ఆధునీకరణ, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం వంటి అంశాలపై దృష్టి సారించినట్లుగా పేర్కొన్నారు.
మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. బయో ఫార్మా, సెమీకండక్టర్, ఎంఎస్ఎంఈలకు చేయూత అందిస్తామని.. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తానమి చెప్పారు. దీర్ఘకాలిక భద్రత, నగరాల అభివృద్ధికి ఆర్థిక జోన్లు ఏర్పాటు చేస్తున్నామని, క్రీడా ఉత్పత్తుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తామని అన్నారు.