Stock Markets : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజూ మార్కెట్ లాభాల్లో ముగియడం విశేషం. బీఎస్ఈ సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 66 పాయింట్లు లాభపడింది. ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పాల్పడటం, ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెంపు లేకున్నా సెప్టెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ప్రకటించడం మార్కెట్‌కు కలిసొచ్చింది.
బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ఉదయం లాభాల్లోనే ప్రారంభమైంది. రోజులో ఒక దశలో 78,007.09 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరగా, 77,440.91 పాయింట్ల కనిష్ట స్థాయిని చూసింది. చివరకు 273.55 పాయింట్లు (0.35 శాతం) లాభంతో 77,928.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ 50 షేర్ నిఫ్టీ కూడా 66.95 పాయింట్ల లాభంతో 24,317.15 వద్ద ముగిసింది. అయితే, బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 67.50 పాయింట్లు నష్టపోయింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కూడా 57.82 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ షేర్లు లాభాలు చవిచూశాయి. అందులో నిఫ్టీ ఆటో షేర్లు 1.63 శాతం పెరిగాయి. బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, మారుతి, రిలయన్స్ భారీగా లాభపడ్డాయి. అందులో ఎం అండ్ ఎం 2.01 శాతం లాభాలు పొందింది.
అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఇండిగో, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. వీటిలో అదానీ పోర్ట్స్ షేర్లు 3.46 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఒడుదొడుకులు ఎదురవుతున్నప్పటికీ భారతీయ మార్కెట్లు నిలకడగా రాణిస్తున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర పెరిగింది. బ్యారెల్‌కు 90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.67 వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,068.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.