ముంబై: మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడటం తప్పనిసరి (speaking Marathi must) అని ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ అన్నారు. మరాఠీ భాషను అగౌరవపరిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మరాఠీలో మాట్లాడటానికి నిరాకరించినందుకు మంగళవారం థానేలో ఒక ఫుడ్ స్టాల్ యజమానిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మహారాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ ఈ సంఘటనపై గురువారం స్పందించారు. రాష్ట్రంలో ఉన్న వారు మరాఠీ మాట్లాడటం తప్పనిసరి అని అన్నారు. ‘మహారాష్ట్రలో మీరు మరాఠీ మాట్లాడాలి. మీకు మరాఠీ తెలియకపోతే, మరాఠీ మాట్లాడబోమన్న వైఖరి ఉండకూడదు. మహారాష్ట్రలో ఎవరైనా మరాఠీని అగౌరవపరిస్తే, మేం మా చట్టాలను అమలు చేస్తాం’ అని మీడియాతో అన్నారు.
మరోవైపు మరాఠీ మాట్లాడని థానేలోని ఫుడ్ స్టాల్ యజమానిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రి యోగేష్ కదమ్ తప్పుపట్టారు. ‘షాపు యజమానిని కొట్టిన వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. వారు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. అప్పుడు అతడిపై చర్యలు తీసుకుని ఉండేవారు’ అని అన్నారు.
Also Read: