లక్నో : బీజేపీ ప్రభుత్వం అవినీతి, విద్వేషం, నిరుద్యోగం, ధరల మంటకు చిరునామాగా మారిందని ఎస్పీ చీఫ్ (SP chief) అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్వేషానికి కాషాయ పార్టీ మారుపేరుగా నిలిచిందని దుయ్యబట్టారు.
యూపీ అసెంబ్లీలో శుక్రవారం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ యోగి ఆదిత్యానాధ్, నరేంద్ర మోదీ సర్కార్లు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రైతులు, వ్యవసాయ రంగాన్ని విస్మరించి రాష్ట్రంలో లక్ష కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను ఎలా సాధిస్తారని యోగి సర్కార్ను అఖిలేష్ నిలదీశారు. 2027 నాటికి యూపీ ఆర్ధిక వ్యవస్ధను లక్ష కోట్ల డాలర్ల స్ధాయికి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలను ఎద్దేవా చేశారు.
వ్యవసాయ రంగానికి ఎలాంటి చేయూత ఇవ్వకుండా, రైతుల తోడ్పాటు లేకుండా ఈ మైలురాయి చేరుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక మణిపూర్ హింసాకాండపై చర్చించేందుకు తమ పార్టీని అనుమతించాలని స్పీకర్ను ఆయన కోరారు.
Read More :