న్యూఢిల్లీ : వేదాంత రిసోర్సెస్ వ్యవస్ధాపక సీఈవో అనిల్ అగర్వాల్ హాలీవుడ్ నటుడు ర్యాన్ రెనాల్డ్స్‌తో ఇటీవల భేటీ అయ్యారు. మహిళలు, పిల్లలకు నేరుగా లబ్ధి చేకూర్చే వేదాంత ప్రతిష్టాత్మక కార్యక్రమం నంద్ ఘర్ గురించి తెలుసుకునేందుకు రెనాల్డ్స్ ఆసక్తి కనబరిచారని అగర్వాల్ తెలిపారు. తామిద్దరం ఒకే విలువల పట్ల విశ్వాసం కలిగిన వారమని అతడితో భేటీ అనంతరం తెలుసుకున్నానని పారిశ్రామికదిగ్గజం చెప్పుకొచ్చారు.
ప్రతి ఒక్కరి అభిమాన సూపర్ హీరో ర్యాన్ రెనాల్డ్స్‌ను ఇటీవల తాను కలుసుకున్నానని, అతడు ఎంతో మంచి వ్యక్తని విన్నానని, అతడిని కలిసిన తర్వాత తామిద్దరి విలువలు ఒకే రకంగా ఉన్నాయని తెలుసుకున్నానని ట్విట్టర్ వేదికగా అగర్వాల్ రాసుకొచ్చారు. ర్యాన్ రెనాల్డ్స్‌తో తాను కలిసి ఉన్న ఫొటోతో అనిల్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
వేదాంత నంద్ ఘర్ కార్యక్రమం పట్ల ఆసక్తి కనబరిచిన రెనాల్డ్స్ తనకు బాలల సంక్షేమ కార్యక్రమాలంటే ఎంతో ఇష్టమని అగర్వాల్‌తో భేటీ సందర్భంగా చెప్పారు. చిన్నతనంలో ఆకలితో బాధపడిన తాను భారత్‌లో ఏ ఒక్క చిన్నారి ఆకలితో నిద్రించరాదని కలలు కన్నానని ర్యాన్‌తో సమావేశం సందర్భంగా అగర్వాల్ ప్రస్తావించారు. చిన్నారులకు పోషకాహార లోపం నివారించేందుకు రుచికరమైన హెల్తీ సప్లిమెంట్ మిల్లెట్ న్యూట్రిబార్ డెవలప్ చేయడం పట్ల రెనాల్డ్స్ సంతోషం వ్యక్తం చేశారని అగర్వాల్ పేర్కొన్నారు.