UP Elections | ఇక సైకిల్‌ను ఎవరూ ఆపలేరని (సమాజ్‌వాదీ గుర్తు) సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సైకిల్ హ్యాండిల్ బాగుందని, రెండు చక్రాలు కూడా సరిగ్గానే వున్నాయని, పైడల్ తొక్కే వ్యక్తి కూడా వచ్చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఇటీవలే గుడ్‌బై చెప్పిన ప్రసాద్ స్వామి మౌర్య, ధరంసింగ్‌తో సహా ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం అఖిలేశ్ సమక్షంలో సమాజ్‌వాదీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అఖిలేశ్ పై వ్యాఖ్యలు చేశారు. యూపీని బీజేపీ ప్రభుత్వం మొత్తం దివాళా తీసిందని మండిపడ్డారు. దేశంలో పెట్రో, డీజిల్ ధరలతో పాటు నిత్యావసరాలు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. అందరూ ఐకమత్యంగా వుంటే వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లు గెలవడం ఖాయమని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు.
రోజుకొకరు బీజేపీని వీడి, సమాజ్‌వాదీలో చేరడంపై అఖిలేశ్ యాదవ్ స్పందించారు. రోజుకొకరు బీజేపీని వీడిపోతున్నారని, అయినా ముఖ్యమంత్రి యోగికి ఆట ఆడటం రావడం లేదని ఎద్దేవా చేశారు. ఆట తెలిసీ.. ఇప్పుడు క్యాచ్ మిస్సయ్యారని విమర్శించారు. తాను ఏ పార్టీలోకి వెళితే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని స్వామి మౌర్య అన్నారని, వచ్చే సారి సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తుందని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు.నిజానికి సీఎం యోగి ఈ నెల 11న గోరఖ్‌పూర్ వెళ్లాల్సి వుందని, ఇంత పెద్ద సంఖ్యలో సమాజ్‌వాదీ పార్టీలో చేరడం చూసి సీఎం యోగి ఇవ్వాళే గోరఖ్‌పూర్‌కు వెళ్లిపోయారని అఖిలేశ్ ఎద్దేవా చేశారు.
సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో ఇద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరూ బీజేపీపై విరుచుకుపడ్డారు.ఈ మకర సంక్రాంతి తర్వాత బీజేపీ పని అయిపోయిందని మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య విమర్శించారు. ఇప్పటి వరకూ కుంభకర్ణుని నిద్రలోఉన్న పార్టీ, ఇప్పుడు మేల్కొందని స్వామి మౌర్య ఎద్దేవా చేశారు.