హైదరాబాద్: ఈసారి కాస్త ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు( Southwest Monsoon) ఇండియాలోకి ఎంటర్ కానున్నాయి. జూన్ 4వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలతో దేశవ్యాప్తంగా వర్షాలు కురవనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం భీకర రీతిలో హీట్‌వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. వర్షాకాలం కాస్త ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన 18 ఏళ్ల నుంచి భారతీయ వాతావరణ శాఖ.. నైరుతి రుతుపవనాల గురించి అంచనాలు వేస్తోంది. 2015 మినహాయిస్తే దాదాపు 2005 నుంచి అన్ని అంచనాలు కరెక్ట్ అయ్యాయి.
సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళలోకి రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఒక వారం రోజులు అటూ ఇటూగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. అయితే రుతుపవనాలను అంచనా వేసేందుకు ఐఎండీ ప్రత్యేక మోడల్‌ను డెవలప్ చేసింది. ఆ మోడల్ ప్రకారం .. రుతుపవనాల అంచనా ప్లస్ లేదా మైనస్ నాలుగుగా ఉంటుంది. ఐఎండీ మొత్తం ఆరు విధానాల్లో వర్షాకాల రాకను అంచనా వేస్తుంది.