న్యూఢిల్లీ, జూన్ 4: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో చావుదెబ్బ తిన్న బీజేపీ దాని మిత్రపక్షాలు దక్షిణ భారతంలో మాత్రం నిలదొక్కుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో 60 నుంచి 70 సీట్ల వరకూ కోల్పోయిన ఎన్డీయే పక్షాలు దక్షిణాన 50 సీట్ల వరకూ గెలుచుకోగలిగాయి.
ఈ స్థానాలే కమలనాథులను మ్యాజిక్ ఫిగర్‌ను అందుకొనేలా చేశాయి. గత ఎన్నికల్లో బీజేపీతో విభేదించి ఒంటరిగా పోటీ చేసిన తెలుగుదేశం ఈ సారి మాత్రం ఎన్డీయే కూటమిలో చేరిపోయింది. ఆ పార్టీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 16 సీట్లను గెలుచుకొని ఎన్డీయేకు ఊపిరిపోసింది. టీడీపీ మద్దతుతో బీజేపీ సైతం ఏపీలో మూడు సీట్లను గెలుచుకోగలిగింది.
ఇక తెలంగాణలో బీజేపీ తన సీట్లను రెట్టింపు చేసుకోగలిగింది. గత ఎన్నికల్లో నాలుగు సీట్లను గెలుచుకున్న కమలనాథులు ఈ ఎన్నికల్లో ఎనిమిది సీట్లను గెలుపొందారు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14 శాతం ఓట్లను మాత్రమే పొందిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల నాటికి 35 శాతం ఓట్లను సాధించడం గమనార్హం. మరో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఆ రాష్ట్రంలోని మొత్తం 28 సీట్లకుగాను బీజేపీ 17 స్థానాలను గెలుచుకోగా, దాని మిత్రపక్షం జేడీఎస్ రెండింటిలో గెలుపొందింది. బీజేపీ మొదటిసారిగా కేరళలో విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. అనేక పర్యాయాలు ఆ రాష్ట్రంలో ఖాతా తెరిచేందుకు కమలనాథులు విఫల ప్రయత్నం చేశారు.
కాగా ఈసారి సినీ నటుడు సురేశ్‌గోపీ బీజేపీ తరఫున గెలుపొంది ఆ పార్టీకి మొదటి సీటును అందించారు. తమిళనాడులో బీజేపీ సినీ నటి రాధిక, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వంటి ఉద్దండులను బరిలో దించినప్పటికీ అక్కడి ప్రజలు వారిని ఆదరించలేదు. తమిళ ప్రజలు ఏకపక్షంగా అన్ని స్థానాల్లో డీఎంకే కూటమికి పట్టంకట్టారు.