న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు తన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్, ఇటీవలే పార్టీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌లను పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. నామినేషన్ల గడువు ముగియటానికి ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ బలం ప్రకారం గెలుస్తామనుకున్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తరుఫున 28 మంది, కాంగ్రెస్ తరుఫున 10 మంది అభ్యర్థులు ఖరారయ్యారు.
బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పది మంది అభ్యర్థుల్లో కర్ణాటక నుంచి పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్, హిమాచల్ ప్రదేశ్‌లోని ఏకైక స్థానానికి సీనియర్ నేత, న్యాయవాది అయిన అభిషేక్ సింఘ్వీ, తెలంగాణ నుంచి రేణుకా చౌదరి ఉన్నారు. 77 ఏండ్ల సోనియా రాజస్థాన్ నుంచి తొలిసారిగా ఎగువ సభలో అడుగు పెట్టనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం ముగియటంతో ఖాళీ అయిన స్థానాన్ని సోనియాగాంధీ భర్తీ చేస్తున్నారు.
సోనియా రాజ్యసభకు పోటీచేయటమంటే ఆ పార్టీ తన ఓటమిని ముందే ఒప్పుకున్నట్టు అని బీజేపీ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడిన మరుసటి రోజే అతనిని బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్‌ను అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నామినేట్ చేసింది. బీజేపీ తరుఫున మొత్తం 28 మంది ఎంపీలు రాజ్యసభ నుంచి నిష్క్రమిస్తుండగా.. వారిలో కేవలం నలుగురికి మాత్రమే బీజేపీ తిరిగి అవకాశం కల్పించింది. అందులో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఉన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో నడ్డా ఈ సారి గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత అజయ్‌మాకెన్ నిరుడు హర్యానా నుంచి రాజ్యసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటక నుంచి బరిలోకి దిగారు. ఖాళీ అయిన 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15.