Sonam Wangchuk | లద్దాఖ్ (Ladakh)లో హింసను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో వాతావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేసి జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన అరెస్ట్ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వాంగ్చుక్కు దాయాది దేశం పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు పాక్‌తోపాటూ మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ తెలిపారు.
లెహ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. పాక్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారి (Pakistan intelligence officer) ఒకరితో వాంగ్చుక్కు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. అతడితో వాంగ్చుక్కు సంబంధాలు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని వివరించారు. అంతేకాదు పాక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వాంగ్‌చుక్ హాజరైనట్లు కూడా తేలింది. అతను బంగ్లాదేశ్‌ను (Bangladesh) కూడా సందర్శించినట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని డీజీపీ వెల్లడించారు. సోనమ్ వాంగ్చుక్కు రెచ్చగొట్టే చరిత్ర ఉందని.. ఎఫ్సీఆర్ఏ నిధుల ఉల్లంఘనకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ వాంగ్‌చుక్ నాయకత్వంలో నిరాహార దీక్ష చేస్తున్న 15 మందిలో ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని సెప్టెంబర్ 10న దవాఖానకు తరలించిన దరిమిలా ఎల్ఏబీ యువజన విభాగం బంద్‌కి పిలుపు ఇచ్చింది. మంగళవారం తన 15 రోజుల దీక్షను విరమించిన వాంగ్‌చుక్ హింసకు పాల్పడవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత లెహ్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు దాని ఎదుట నిలిపి ఉన్న భద్రతా సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేశారు. ఈ అల్లర్లకు వాంగ్‌చుక్‌కే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read..
వాంగ్‌చుక్ అరెస్ట్.. జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్న పోలీసులు
Google | గూగుల్‌కి 27ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా..?