న్యూఢిల్లీ, జూలై 22: స్మార్ట్ఫోన్లు వాడుతున్న 13 ఏండ్ల పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. భారత్తో సహా ఆయా దేశాలకు చెందిన 1,30,000 మంది (18-24 ఏండ్ల) మానసిక ఆరోగ్య డాటాను పరిశోధకులు విశ్లేషించగా, స్మార్ట్ఫోన్ వాడుతున్న 13 ఏండ్ల లోపు పిల్లల్లో దూకుడు స్వభావం, వాస్తవికతకు దూరంగా భ్రమల్లో గడపటం, నిర్లిప్తత, ఆత్మహత్య ఆలోచనలు.. మొదలైనవి ఎక్కువగా కనపడినట్టు వారి నివేదిక పేర్కొన్నది.
‘జర్నల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, క్యాపబిలిటీస్’ కథనం ప్రకారం, పిల్లల కోసం ‘కిడ్స్ ఫోన్లు’ తీసుకురావాల్సిన అవసరముందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 13 ఏండ్ల లోపు స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న పిల్లలు తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడతారని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనాల్సిన అవసరముందని, సురక్షితమైన డిజిటల్ వేదికలను అందుబాటులో తీసుకొచ్చేలా విధానాలు రూపొందించాలని తెలిపింది.