న్యూఢిల్లీ, జనవరి 26: పంటలకు అందచేసే కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని ఇవ్వడంతో సహా వివిధ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో రైతులు ఆదివారం ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు. రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ర్యాలీలు జరిగాయి. పంజాబ్, హర్యానాలలో ఈ ర్యాలీలు ఉధృతంగా సాగాయి. తమ డిమాండ్ల సాధన కోసం రైతులు 2024 ఫిబ్రవరి 13 నుంచి ఎస్కేఎం(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం) ఛత్రం కింద పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ వద్ద ఆందోళన చేస్తున్నారు.
రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలపై రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ చండీగఢ్‌లో మాట్లాడుతూ రైతులు, కార్మికుల అభిప్రాయాలను, వారి డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గౌరవించడం లేదని ఆరోపించారు. తమ డిమాండ్లను కేంద్రం నెరవేర్చని పక్షంలో ఢిల్లీ సరిహద్దుల్లో 2020-21లోజరిగిన ఆందోళనల కన్నా ఉధృతంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ఎస్కేఎం హెచ్చరించింది.